సకల విఘ్నాలు తొలగించి కోరిన కోరికలు తీర్చే ఆది దేవుడు…విఘ్నేశ్వరుడు. దేశవ్యాప్తంగా వినాయకుడు వివిధ రకాల ఆకృతులలో పూజలందుకుంటున్నాడు. అయితే నల్లమల్ల అడవుల్లో కొలువైన ఉన్న కొన్ని వినాయక రాతి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆదిమానవుల ఆనవాళ్లు, చారిత్రక ప్రాధాన్యం గల ఈ రాతి వినాయక విగ్రహాలు తమ విభిన్నత్వాన్ని, ప్రాచీనత్వాన్ని చాటుకుంటున్నాయి. ఈ రాతి విగ్రహాలను ప్రతిష్టాపనకు సంబంధించిన వివరాలు మాత్రం తెలియకపోయినా..ప్రాచీన నాగరికతలో లోహయుగానికి, విజయ నగర రాజుల కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. మరి వివిధ ఆకృతులలో భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్న ఆ ప్రాచీన గణపతుల గురించి తెలుసుకుందామా..అయితే నల్లమల్ల అడవులకు వెళదాం పదండి.
కొట్టాల చెర్వు ఇసుకరాతి వినాయకుడు :
నల్లమల అడవుల్లో ఆత్మకూరు మండలం, కొట్టాల చెర్వు సమీపంలో ఉన్న వరదరాజస్వామి ప్రాజెక్ట్ సమీపంలోని ఒక చెట్టు కింద ఒక వినాయక విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని ఎవరో ప్రాచీన శిల్పకారుడు ఇసుక రాతితో చెక్కినట్లు తెలుస్తోంది. అయితే విగ్రహంపై ఎలాంటి ఆభరణాలు చెక్కి ఉండక పోవడం గమనిస్తే ఇది లోహ యుగానికి ముందు కాలానికి చెందిన అన్న అనుమానం తలెత్తుతుంది. ఈ విగ్రహాన్ని పరిశీలిస్తే..తలపై ఉన్న కిరీటం కూడా ఆకు దొన్నెనో, కర్రతో చేసిందా అన్నట్లుగా ఉంటుందే కాని లోహ కిరీటంగా కనిపించదు. ఇనుప పనిముట్లు కనిపెట్టకముందు ఆదిమానవులు కర్ర, చెక్క వంటి సాధనాలనే వాడేవారు. కావున ఇది లోహయుగానికి కంటే ముందే ఉన్న ప్రాచీన శిలా యుగానికి చెందిన విగ్రహంగా పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
నాగలూటి అష్టభుజి వినాయకుడు :
నల్లమల్లలో ఉన్న ప్రాచీన రాతి వినాయక విగ్రహాలలో మరో ప్రసిద్ధి చెందినది..అష్టభుజి వినాయకుడు. నాగలూటి వీరభధ్రాలయం సమీపంలో శ్రీశైలం మెట్ల మార్గం వద్ద.. ఎనిమిది చేతులతో కూడిన ఈ అష్టభుజ వినాయకుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. నల్లటి గ్రానైట్ శిలతో చెక్కిన ఈ విగ్రహంలో వినాయకుడు అష్ట కరములతో వివిధ ఆయుధాలను ధరించి ఉన్నాడు. కావున అష్టభుజి వినాయకుడిగా కొలుస్తున్నారు. వినాయకుడి ఎడమ వైపున కుమార స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఇక నాగలూటి వీరబధ్రాలయాన్ని విజయనగర పాలకులు నిర్మించారని స్థల చరిత్ర చెబుతుంది. దీంతో ఈ అష్టభుజి వినాయకుడి విగ్రహం 14వ శతాబ్దానికి చెందినదిగా తెలుస్తుంది.
సిద్ధాపురం వినాయకుడు :
ఆత్మకూరు మండలం , సిద్ధాపురంలో ఒక వేప చెట్టు కింద ఈ విగ్రహం కనిపిస్తోంది. సిద్ధాపురంకు సమీపంలోని ముర్తుజావలి దర్గా సమీపంలో వెయ్యేళ్లకు పూర్వం ఒక మహా పట్టణం ఉండేది. ఇక్కడ పలు ఆలయాల శిథిలాలు ఉన్నాయి. ఈ కోట గోడల రాళ్లను సిద్ధాపురం చెరువు రివిట్ మెంట్‌కు వాడారు. ఆ సందర్భంలో శిథిల పట్టణం నుంచి వినాయక విగ్రహం సిద్ధాపురం గ్రామానికి చేరింది. ఈ వినాయక విగ్రహంలో ఆభరణాలు కనిపిస్తున్నాయి ఈ విగ్రహానికి సంబంధించిన వివరాలు తెలియడం లేదు.
గుమ్మిత వినాయకుడు
ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని నాగలూటి రేంజ్‌లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గుప్త మల్లికార్జున (గుమ్మితం) ఆలయ ఆవరణలో ఈ ప్రాచీన గుమ్మిత వినాయక విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించారని స్థల పురాణం తెలుపుతోంది. ఇసుక రాతితో చెక్కిన ఈ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది.
ఇదండి.. ఆదిమానవులు సంచరించి ప్రాచీన శిలా యుగం నుంచి నుంచి విజయ నగర రాజుల కాలానికి చెందిన ఈ నల్లమల్ల గణపతుల ప్రత్యేకత. మీకు వీలైతే దట్టమైన నల్లమల్ల అడవుల్లో కొలువైన ఈ ప్రాచీన గణపతులను దర్శించండి..ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదకరమైన పర్యాటక అనుభవాన్ని పొందండి.