గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని భావించిన సీఎం జగన్ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా ప్రభుత్వానికి 58 కోట్ల ఆదాయం కూడా చేకూరింది. కాగా పోలవరం ప్రాజక్టు నిర్మాణపనుల్లో సంస్థలు ఇలా తక్కువకే కోట్ చేయడం వెనుక క్విడ్‌ఫ్రోక్ ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా ఎల్లోమీడియా ఛానళ్లు గగ్గోలు పెడుతున్నాయి. పోలవరంలో ప్రభుత్వం చేసింది రివర్స్ టెండరింగ్ కాదని.. రిజర్వ్ టెండరింగ్ అని చంద్రబాబు ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశాడు. తాజాగా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ ఎత్తు తగ్గిస్తుందంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన డ్యామ్ ఎత్తు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అదే జరిగితే సీఎం జగన్ చరిత్రహీనుడు అవుతాడంటూ టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. ఆదివారం కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై జ్యోతుల స్పందించారు. గత ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో లబ్ది జరిగినందుకే..అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం జగన్ ఆయన చెప్పినదానికల్లా తలూపుతున్నారని నెహ్రూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటలు విని…పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి రాష్ట్రానికి అన్యాయం చేస్తే సీఎం జగన్ చరిత్ర హీనుడు అవుతాడంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. మొత్తం 196 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ ఎత్తు తగ్గిస్తే 60 టీఎంసీల నిల్వ తగ్గుతుందని జ్యోతుల నెహ్రూ చెప్పారు. ఎత్తు తగ్గడం ద్వారా ఇటు కోస్తాతో పాటు రాయలసీమకూ అన్యాయం జరుగుతుందన్నారు. అయితే రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.58 కోట్లు ఆదా చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతోందని.. కానీ టెండరు దక్కించుకున్న కంపెనీ పనులను పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోందని నెహ్రూ తీవ్రంగా ఆక్షేపించారు. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రివర్స్ టెండరింగ్‌కు వెళితే..అది క్విడ్‌ఫ్రోకో…రిజర్వ్ టెండరింగ్ అంటూ చంద్రబాబు ఒక పక్క ఆరోపణలు చేస్తుంటే మరోపక్క పోలవరం డ్యామ్ ఎత్తును ప్రభుత్వం తగ్గించేందుకు కుట్ర చేస్తుందంటూ..జ్యోతుల వంటి టీడీపీ నేతలు కొత్త వాదన తీసుకువస్తున్నారు. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనుల్లో రివర్స్ టెండరింగ్ విషయంపై, ఎత్తు తగ్గిస్తున్నారంటూ వస్తున్న టీడీపీ చేస్తున్న విమర్శలపై స్వయంగా సీఎం జగన్ కానీ, మంత్రులు కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
