తూగో జిల్లాలో జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు వూపందుకున్నాయి. ఇప్పటికే కీలక నేత అయిన ఆకుల సత్యనారాయణ,తన భార్యతో సహా వందలాది మంది అనుచరులతో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ..ఇవాళ రాజోలు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అల్లూరి కృష్ణంరాజు గతంలో రాజోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. స్వతహాగా వ్యాపారి అయిన కృష్ణంరాజుకు సేవాగుణం ఎక్కువ. అందుకే ప్రజల ఆదరాభిమానాలు పొందగలిగారు. గతంలో వైసీపీలోనే ఉన్న అల్లూరి కృష్ణంరాజు పార్టీలో నెలకొన్న వర్గ విబేధాల నేపథ్యంలో ఇటీవలి ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. అయితే రాజోలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా మారడంతో గత ఎన్నికల్లో అక్కడినుండి రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. కాగా వైసీపీ అధికారంలోకి రావడం, జనసేన ఘోర పరాజయం పాలవడం, ముఖ్యంగా అధినేత పవన్ కల్యాణ్ తీరుపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న అల్లూరి గత కొంత కాలంగా తిరిగి సొంతగూటికి వెళ్లేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. ఈ క్రమంలో ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ…రాజోలు నియోజకవర్గ పరిధిలో వైస్సార్సీపీని బలోపేతం చేస్తామన్నారు…జగన్ పరిపాలన బాగుండటం వల్ల తిరిగి వైస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు… 2019లో కొన్ని కారణాల వల్ల జనసేన పార్టీలో చేరిన తాను ఇప్పుడు జగన్ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితమైనట్లు తెలిపారు. ఎలాంటి వ్యక్తిగత లాభం, పదవి తనకు అవసరంలేదన్నారు. రాబోయే రోజుల్లో రాజోలులో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని కృష్ణంరాజు వెల్లడించారు. ఇప్పటికే రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్టీలో కీలక నేత అయిన మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు వైసీపీలో చేరడంతో పవన్ కల్యాణ్‌కు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. మొత్తంగా ఆకుల, అల్లూరి వంంటి కీలక నేతలంతా వైసీపీలో చేరడంతో జిల్లాలో జనసేన తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. మరి జనసేన నేతల వలసలపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
