ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి కారణం సీఎం జగన్ అసమర్థతే కారణమని, అసలు ప్రాజెక్టుపై మాట్లడటానికి మంత్రి పత్తాలేకుండా పోయారంటూ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా తీవ్ర విమర్శలపై చేసిన సంగతి తెలిసిందే. దేవినేని ఉమా విమర్శలపై మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మైలవరం నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పినా ఉమాలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఇసుక దీక్షలో నీ స్థానం ఎక్కడ ఉందో తెలుసుకో..నువ్వు ఇసుక అక్రమాలకు పాల్పడ్డావు కాబట్టే..నిన్ను చంద్రబాబు ఇసుక దీక్షలో కింద కూర్చోబెట్టాడు అని ఉమను ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును జగన్ సర్కార్ ఆపేసిందంటూ ఉమ చేసిన విమర్శలపై వసంత కృష్ణప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం రాసుకోండి అంటూ గతంలో ఉమ బీరాలు పలికిన విషయాన్ని వసంత గుర్తు చేశారు. 2018 నాటికి పోలవరం ఎక్కడ పూర్తి చేశారో దేవినేని ఉమా చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరంలో మీరు చేసిన అవినీతి నచ్చకనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రివర్స్ టెండరింగ్ చేపట్టారని చెప్పారు. దేవినేని ఉమా వెకిలి చేష్టలు చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ ఉమా ఆడో మగో తెలియదన్నారని, ఇప్పుడు అదే నిజమవుతోందని చురకలు అంటించారు. మంత్రులను పట్టుకొని సన్నాసి అంటూ దేవినేని ఉమా పిచ్చెక్కి మాట్లాడుతున్నారని వసంత తీవ్రంగా ఆక్షేపించారు. వైఎస్ జగన్‌కు సంస్కారం ఉంది కాబట్టి టీడీపీ నేతలపట్ల గౌరవంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దేవినేని ఉమా ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని, ఉమా వెకిలి చేష్టలు మానుకోవాలని…లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వసంత హెచ్చరించారు. మైలవరం, పురగుట్టలో జరిగిన అవినీతిపై త్వరలోనే మీడియాకు వివరిస్తానని వసంత అన్నారు. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గం పనుల్లో నారా లోకేష్ 5 శాతం, ఉమా 3 శాతం చొప్పున కమీషన్లు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. వారిద్దరు ఎక్కడెక్కడ కమీషన్లు తీసుకున్నారో వెల్లడించేందుకు ఆ కమీషన్లు ఇచ్చినవారు త్వరలో మీడియా సమావేశం పెట్టబోతున్నట్లు వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో చేసిన అవినీతికి దేవినేని ఉమాకు జైలు జీవితం తప్పదని హెచ్చరించారు. మొత్తంగా దేవినేని ఉమపై వైసీసీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మైలవరంలో హాట్‌టాపిక్‌గా మారాయి.
