అమరావతి పర్యటనలో చంద్రబాబుకు రైతుల నిరసన సెగ తగిలింది. దళితుల భూముల విషయంలో మోసం చేసారని..గ్రాఫిక్స్ తో మాయ చేసారంటూ కొందరు రైతులు చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసారు. వెంకటాయ పాలెం వద్ద చంద్రబాబుతో పాటుగా ఉన్న టీడీపీ నేతల కాన్వాయ్ మీదకు చెప్పులు..రాళ్లు విసిరే ప్రయత్నం చేసారు. పోలీసుల రంగం ప్రవేశం చేసి వారిని చెదర గొట్టారు. రాజధాని పేరుతో భూములు దోచుకున్న చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటించవద్దంటూ రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మా ప్లాట్లు ఎక్కడున్నాయో చూపించిన తర్వాతే రాజధాని ప్రాంతంలో పర్యటించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాజధాని కోసం ల్యాండ్‌పూలింగ్ పేరిట చంద్రబాబు పెద్ద ఎత్తున రైతుల నుంచి భూములు సేకరించిన సంగతి తెలిసిందే. అయితే, తమ నుంచి సేకరించిన భూములకు బదులుగా కనీసం ప్లాట్లు కూడా ఇవ్వకపోవడంతో తమ జీవితాలు రోడ్డునపడ్డాయని పలువురు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నిరసనకు దిగారు. బాబూ.. నీ వల్ల మా బతుకులు బుగ్గిపాలయ్యాయంటూ భగ్గుమంటున్నారు. రైతులకు తీవ్ర ద్రోహం చేసిన చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించవద్దంటూ ఆందోళన చేపట్టారు. అయితే, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై టీడీపీ శ్రేణులు గుండాయిజానికి దిగారు. ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపిన రైతులపై దాడులకు దిగారు. దీంతో అమరావతిలోని వెంకటాయపాలెంలో వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. రైతుల దగ్గర 34 వేల ఎకరాలకు పైగా విలువైన భూములు లాక్కుని ఐదేళ్లలో కనీసం ప్లాట్లు కూడా ఇవ్వకుండా చేతులెత్తిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదునెలల్లోనే అమరావతి రైతులకు ప్లాట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో రాజధాని పేరుతో జాతీయ మీడియాను వెంటపెట్టుకుని నీచ రాజకీయానికి పాల్పడుతున్న చంద్రబాబు తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. అందుకే నీ వల్ల మా బతుకులు బుగ్గిపాలయ్యాయంటూ రైతులు బాబుపై తిరగబడుతున్నారు. మొత్తంగా అమరావతి పర్యటనలో రాజకీయం చేద్దామని వచ్చిన చంద్రబాబుకు రైతుల చేతిలో ఘోర అవమానం ఎదురైంది.
