ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైయస్ వివేకా హత్య సంచలనం రేపింది. వైయస్ వివేకా హత్యపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగింది. గత 9 నెలలుగా ఈ కేసుపై విచారణ జరుగుతోంది. తాజాగా వైయస్ వివేకా హత్య కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. వారం రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని సిట్ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో అనుమానితులను వరుసగా విచారిస్తున్నారు. గురువారం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ప్రస్తుతం బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డిని సిట్ అధికారులు వివేకా హత్యకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. ఉదయం బీటెక్ రవిని వివేకా హత్య, తదనంతరం జరిగిన పరిణామాలపై ప్రశ్నించిన అధికారులు.. పలు అంశాలపై గుచ్చి గుచ్చి అడిగి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. వివేకా హత్యకు సంబంధించి తన వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా..సిట్‌కు అందజేస్తానని, కావాలంటే దర్యాప్తుకు ఎప్పుడు పిలిచినా వచ్చి సహకరిస్తానని ఈ సందర్భంగా బీటెక్ రవి సిట్ అధికారులకు తెలిపారు. తర్వాత ఆదినారాయణ రెడ్డి సోదరుడి దేవగుడి నారాయణరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. విచారణలో ఆయన చెప్పిన అంశాల ఆధారంగా తదుపరి ఎంక్వైరీ కొనసాగుతుందని సిట్ అధికారులు ప్రకటించారు. రవి, నారాయణరెడ్డి చెప్పిన అంశాలను నోట్ చేసుకున్న సిట్ అధికారులు ఈ కేసులో అనుమానితులకు నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటికే టీడీపీ నేత కోరటి ప్రభాకర్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించారు. ఇప్పటివరకు 1300 మంది అనుమానితులను సిట్ విచారించడం గమనార్హం. కొందరిని పుణెకు తీసుకువెల్లి నార్కో అనాలిసిస్ టెస్ట్‌లు కూడా నిర్వహించారు. అయినా వివేకా హత్యకేసు ఓ కొలిక్కి రాకపోవడంతో ప్రభుత్వం తీవ్ర అసహనంతో ఉంది. త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని సిట్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మురం చేశారు. వారం రోజుల్లో వైయస్ వివేకా హత్య కేసులో అసలు నిందితులు ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా బీటెక్ రవి, దేవగుడి నారాయణరెడ్డిలను ప్రశ్నించడంతో వైయస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేతల ప్రమేయం ఏదైనా ఉందా అనే విషయంపై కడప జిల్లాలో చర్చ జరుగుతోంది.
