ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో దిశ ఉదంతం నేపథ్యంలో మహిళల భద్రతపై డిసెంబర్ 9 న వాడీవేడి చర్చ జరిగింది. దిశ ఘటనపై వైసీపీ మహిళా నేతలు ప్రసంగిస్తుంటే..టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఉల్లి సమస్యను చర్చించాలంటూ పదేపదే అడ్డుకోబోయారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా చంద్రబాబు, లోకేష్, బాలయ్యలపై ఫైర్ అయ్యారు. మహిళల భద్రతపై చర్చిస్తున్న ఏపీ అసెంబ్లీని యావత్ దేశం గమనిస్తుందని..టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్థం కావడం లేదని రోజా అన్నారు. ఎక్కడ కాల్‌మనీ సెక్స్ రాకెట్ బయటపడుతుందా అన్న భయం వారిలో ఉందని…విజయవాడలో దాదాపు 200 మంది అమాయక మహిళలను కాల్‌మనీ పేరుతో సెక్స్ రాకెట్ కూపంలోకి నెట్టింది..టీడీపీ నేతలే అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బాబుగారి వియ్యంకుడు, లోకేష్ మామగారైన బాలయ్య గారి గురించి చెప్పనక్కర్లేదని, అమ్మాయి కనిపిస్తే కడుపులు చేయాలన్న వ్యక్తి ఆయన అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక లోకేష్ అమెరికాలో తాగితందనాలాడుతూ..అమ్మాయిలతో దిగిన ఫోటోల గురించి సభలో చర్చిస్తారని టీడీపీ నేతలు భయపడుతున్నట్లు ఉన్నారని రోజా చురకలు అంటించారు. గత ఐదేళ్లలో టీడీపీ నేతలు మహిళలపై ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డారో ప్రజలందరూ చూశారని రోజా అన్నారు. ఒక దళిత మహిళను వస్త్రాలు ఊడదీసి భౌతిక దాడులకు తెగబడింది టీడీపీ నేతలే అని రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబు టీడీపీ నేతలను చంద్రబాబు నాయుడు ఎందుకు వెనకెసుకొస్తున్నారని రోజా మండిపడ్డారు. ఆడవాళ్ల మాన, ప్రాణాలపై సభలో చర్చిస్తుంటే చంద్రబాబు ఇలా ఆందోళన చేయించడం సరికాదన్నారు. బాబు వైఖరి తెలిసే ప్రజలు ఆయన్ని ఓ మూలానా కూర్చొబెట్టారని రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆలోచన మొత్తం లోకేశ్ తినే పప్పులో ఉల్లిపాయ గురించే అని విమర్శించారు. ఆయనకు ఆడపిల్లలు ఉంటే వారి విలువ తెలిసుండేది కాని …లేనందున మహిళల సమస్యపై మాట్లాడేందుకు అడ్డుకుంటున్నారని చెప్పారు.ఈ సందర్భంగా సీఎం జగన్ గురించి మాట్లాడుతూ.. బాహుబలి సినిమాలో ఒక సీన్‌ను రోజా గుర్తుచేశారు. మాజీ సేనాధిపతి భార్యను సేనాధిపతి భుజంపై చేయివేయడంతో.. అతడి తలను నరుకుతాడని పేర్కొన్నారు. తాను సినిమా చూసిన సమయంలో కొందరు మహిళలు చప్పట్లు కొట్టారని చెప్పారు. అంటే మహిళలను వేధించినవారిపై చర్యలు తీసుకునేందుకు ప్రతీ ఒక్కరు స్వాగతిస్తున్నారని చెప్పారు. గన్ వచ్చే లోపు జగన్ శిక్షిస్తాడనే నమ్మకం ఏపీలో కలిగిస్తామని రోజా చెప్పుకొచ్చారు. మొత్తంగా ఏపీ అసెంబ్లీలో బాబు, బాలయ్య, లోకేష్‌లపై ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలతో టీడీపీ ఎమ్మెల్యేలు కంగుతిన్నారు. ఏం మాట్లాడాలో అర్థం కాలేక సైలెంట్ అయిపోయారు.
