ఫేక్ న్యూస్ సృష్టించినా వాటిని షేర్ చేసినా కఠిన చర్యలు తప్పవంటూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై నిరాధార వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆయా శాఖల కార్యదర్శులకు అధికారాలు కల్పిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు రాస్తే ఇకపై పరువు నష్టం కింద నోటీసులు జారీ చేసేందుకు కార్యదర్శులకు అధికారం కల్పించింది. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా కల్పత కథనాలను రూపొందిస్తున్నారని జగన్ దృష్టికి రావడంతో తప్పుడు వార్తలను కట్టడి చేసి ఆయా సంస్థలపై చర్యలు తీసుకోవాలని సీఎం నిర్ణయించారు.
ఈ నేపద్యంలో ఏపీ సిఎం జగన్ కు పీసీఐ షాక్ ఇచ్చింది. మీడియాపై ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన జీవో 2430 ను రద్దు చేయాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచీ ఆదేశాలు వచ్చాయి. ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఆదేశాలను జారీచేసింది. ప్రభుత్వం తరఫున సమాచార, పౌరసంబంధాల శాఖ తరఫున అదనపు డైరెక్టర్ కిరణ్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) తరఫున ఆలపాటి సురేష్ హాజరయ్యారు. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ ప్రసాద్ వెంటనే జీవోను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.