దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగారానికి ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఈ కర్మాగారాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎ జగన్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడం తన జీవితంలో మరచిపోలేని రోజని అన్నారు. ఈ ఉక్కు కర్మాగారాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాకు స్టీల్ ప్లాంటు రావాలని.. అభివృద్ధి బాటలో పరుగులు పెట్టాలని చాలా ఏళ్లుగా అనుకున్నాం. నాన్నగారి హయాంలో జిల్లా అబివృద్ధికి బీజాలు పడ్డాయి. కానీ ఆయన చనిపోయిన తరువాత కడప జిల్లాను పట్టించుకునేవారే లేకుండా పోయారు. సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు ఒక పెద్ద మనిషి వచ్చి టెంకాయ కొట్టాడు. ఐదేళ్లు పాలించడానికి ప్రజలు అధికారమిస్తే.. నాలుగేళ్లు ఏమి చేయకుండా ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే మోసం అంటారు. అదే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే టెంకాయ కొడితే చిత్తశుద్ధి అంటారు. పాలనలో తేడాను ప్రజలు గమనించాలి. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక, పరోక్షంగా 25వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి నెలకొంటుంది. అక్షరాల రూ. 15 వేలకోట్ల రూపాయలతో పునాదిరాయి వేశాం. స్టీల్ ప్లాంట్‌కు కావాల్సిన ఐరన్ ఓర్ కోసం ఎన్‌ఎండీసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని సీఎం జగన్ తెలిపారు. మొత్తంగా కడప జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన స్టీల్ ప్లాంట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
