అమరావతిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న వేళ..రాజధాని ప్రాంతానికే చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు తాడేపల్లి సీఎం జగన్‌ను కలిసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూడు రాజధానులపై చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును మద్దాలి తప్పు పట్టారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం జగన్‌ను కలిసినట్లు గిరి క్లారిటీ ఇచ్చినా..బాబు తీరుకు నిరసనగా త్వరలోనే ఆయన వైసీపీలో చేరడం ఖాయమని వార్తలు వచ్చాయి. తదనంతరం పార్టీలో తనకు ఎదురవుతున్న అవమానాల నేపథ‌్యంలో మద్దాలి గిరి మరోసారి చంద్రబాబుపై నిప్పులు చెరుగుతూ…ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ యథాతథంగా మీ కోసం…
తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారాచంద్రబాబు నాయుడుగారికి ….
ప్రతిపక్షంలో ఉన్నా, ప్రధాన పక్షంలో ఉన్నా..ప్రజల పక్షానే నేనెప్పుడు ఉన్నాను. నన్ను గెలిపించిన నా నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కార మార్గాలను, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి గారితో చర్చించడమే నేను చేసిన నేరమా…? నేటి సమాజానికి విద్యార్థులకు దారి చూపే, ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం నిర్ణయాన్ని సమర్థించడమే నేను చేసిన అన్యాయమా..? గత 6 సంవత్సరాలుగా ఎన్నో కష్ట, నష్టాలను ఎదురొడ్డి పార్టీనే నమ్ముకుని సొంత పార్టీ నుంచే ఎన్నో సమస్యలు ఎదుర్కొని, మీ నుంచి ఎలాంటి సహాయం లేకున్నా ..మీరు ఇచ్చిన బాధ్యతలను స్వీకరించిన నాకు మాట మాత్రమైనా చెప్పకుండా, ముఖ్యమంత్రిని కలవడం వెనుక ఉన్న కారణాలను కూడా నా నుంచి తెలుసుకోకుండా, కనీసం షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా, కేవలం 12 గంటలలోనే నియోజకవర్గ ఇంచార్జిగా మరొకరిని నిర్ణయించడంలో మీ ఆంతర్యం ఏమిటి..? పార్టీలో కేవలం ఒక సామాజికవర్గానికే పెద్ద పీట వేస్తారా..గన్నవరం నియోజకవర్గంలో నా తోటి శాసనసభ్యుడు వల్లభనేని వంశీ విషయంలో మీరు ఇలాగే చేశారా..అలాగే బాపట్ల నియోజకవర్గంలో ఇంచార్జిని నియమించారా..? సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇంచార్జీని నియమించారా..అక్కడ ఇంచార్జి నియామకం చేపట్టకపోవడం, ఇక్కడ నా విషయంలో మాత్రం వేగంగా అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడంలో గల మతలబు ఏమిటీ..? సమాజమే దేవాలయంగా అన్న నందమూరి తారకరామారావు గారు భావిస్తే..ఈ రోజు కేవలం ఒక సామాజికవర్గానికే ప్రాధాన్యతను ఇవ్వడం చూస్తుంటే ఎంతో ఆవేదన కలుగుతుంది. విశాఖలో టీడీపీకి చెందిన నలుగురు సభ్యులు..అమరావతిని రాజధానిగా వ్యతిరేకించి..విశాఖను రాజధానిగా చేయడాన్ని సమర్థించినప్పుడు వారిపై ఎలాంచి చర్యలు తీసుకున్నారు. నేను గెలిచిన గుంటూరును దేవాలయంగా, ఇక్కడి ప్రజలే దేవుళ్లుగా భావించి, ప్రజాసేవకుడిగా ప్రజల తరపున ప్రతినిధిగా వారు నామీద ఉంచిన బాధ్యతను నిర్వర్తించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన నాపై ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడమేనా మీ అనుభవం చంద్రబాబుగారూ..అంతా మీ విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ..మద్దాలి గిరి స్వయంగా తాను రాసిన బహిరంగ లేఖలో చంద్రబాబుపై మండిపడ్డారు. మొత్తంగా చంద్రబాబు తన సామాజికవర్గానికే పెద్ద పీట వేస్తున్నాడంటూ గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గారి చేసిన విమర్శలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. తనకు తన సామాజికవర్గ ప్రయోజనాలే ముఖ్యమంటూ అమరావతిలో చేయిస్తున్న ఆందోళనలను చూస్తుంటే..చంద్రబాబు ఇక కేవలం కమ్మ సామాజికవర్గ ప్రతినిధిగానే మిగిలిపోయేలా ఉన్నాడని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.