చస్తే చస్తాం గానీ.. జనసేన పార్టీని ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేయం. మనం కలుపుతామా బీజేపీలో జనసేన పార్టీని… చస్తే చస్తాం.. ఉంటే ఉంటాం.. పోతే పోతాం.. కానీ తెలుగుజాతి ఉన్నతిని, గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుకుంటూనే ఉంటాం..ఇవి సరిగ్గా గత ఏడాది అక్టోబర్‌లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు…అయితే పొలిటికల్ గబ్బర్ సింగ్‌కు కొంచెం తిక్కుంది..దానికో లెక్కుంది…ఏ లెక్క కుదిరిందో కానీ..కమ్యూనిస్టులకు హ్యాండ్ ఇచ్చేసి…కాషాయనాథులను కౌగిలిలో చేరాడు..అంతే కాదు నిన్నటిదాకా నాలో కమ్యూనిజం భావజాలాలు ఉన్నాయంటూ..తనకు తాను చేగువేరాతో పోల్చుకున్న పవన్…బీజేపీతో చేతులు కలిపిన తర్వాత..నేనేమైనా కమ్యూనిస్టులకు బాకీ ఉన్నానా అంటూ కసురుకున్నాడు. దీంతో ఖంగు తిన్న ఎర్రన్నలు పవన్ కల్యాణ్ చేగువీరా కాదు చెంగువీరుడు అయ్యాడంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు.
తాజాగా జనసేన, బీజేపీ పొత్తుపై ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు స్పందించాయి. రాష్ట్రానికి అన్నివిధాలా ద్రోహం చేసిన బీజేపీతో చేతులు కలుపుతావా? అంటూ పవన్‌కల్యాణ్‌పై మండిపడ్డాయి. రాజకీయాల్లో ఎత్తులు, పొత్తులు ఉంటాయే తప్ప బాకీలు ఉండవని, సీపీఐ. సీపీఎం పార్టీల కార్యదర్శులు ఎద్దేవా చేశారు. ‘‘విప్లవ వీరుడు చేగువేరా బొమ్మ పెట్టుకుని చిలకపలుకులు పలికిన పవన్ ఇప్పుడు ‘చెంగువీరుడు’ అయ్యాడంటూ సెటైర్లు వేశారు. ఢిల్లీలో బీజేపీ నాయకుడు నడ్డాను కలిశాక పవన్‌కు పాచిపోయిన లడ్డూలు కాస్తా బందరు లడ్లు అయ్యాయంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పవన్‌పై మండిపడ్డారు. ‘‘కమ్యూనిస్టులకు బాకీ పడ్డానా? అంటున్నాడు పవన్.. రాజకీయాల్లో ఏమైనా అప్పులుంటాయా? అని ప్రశ్నించారు. దమ్మున్నవాడే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడగలరని, ఆ దమ్ము మాకుందని, నీకు లేకనే బీజేపీతో కలుస్తున్నావా? అంటూ రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు.
ఇక సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు కారణమై, ప్రత్యేక హోదాను నిరాకరించి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీతో ఎలా చేతులు కలుపుతావని పవన్‌ను తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రానికి ‘పాచిపోయిన లడ్లు’ ఇచ్చారంటూ బీజేపీని విమర్శించిన పవన్‌కు ఇప్పుడవే తాజాగా కనిపించడం విడ్డూరమన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ నిర్ణయమనడం జనాన్ని మోసం చేయడమేనని, ఆత్మవంచన కూడా అని ఆయన అన్నారు. పవన్ బీజేపీతో కలవడమంటే నిస్సందేహంగా అవకాశవాదమేనన్నారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన ద్రోహానికి ప్రజలు గత ఎన్నికల్లో ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారని, రాబోయే రోజుల్లోనూ పవన్‌కు అదే గతి తప్పదని అన్నారు. మొత్తంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకుని, తమను మోసం చేసిన పవన్ కల్యాణ్‌పై ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నాయి.