ఏపీ వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుపెట్టకుండా టీడీపీ ఎమ్మెల్సీలు రౌడీయిజం ప్రదర్శించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఎంతగా ప్రయత్నించినా…టీడీపీ ఎమ్మెల్సీలు రాద్ధాంతం చేస్తూ..బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నారు. అయితే శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ తప్పు చేస్తున్నా అంటూనే విచక్షణా అధికారం వినియోగిస్తూ ఏపీ వికేంద్రీకరణ , సీఆర్‌డీఏ రద్దు బిల్లులను స్పీకర్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపారు. అయితే శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్న సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబుతో జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..అసెంబ్లీ ఆమోదించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టనివ్వకుండా తాము ఏ విధంగా రౌడీయిజం ప్రదర్శించామో ఆ పార్టీ సభ్యులే స్వయంగా చంద్రబాబుకు వివరించారు. సభలో ఆ విధంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని చెప్పాల్సిన చంద్రబాబు అలాంటి సలహాలేవీ ఇవ్వకుండా.. ‘ఓకే గుడ్. బాగా చేశారు’…అంటూ వారిపై ప్రశంసలు కురిపించారు. అంతేకాక.. ఎమ్మెల్సీలతో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మీరు లోపల కూర్చున్నారు. నేను టీవీ దగ్గర కూర్చుని మండలిలో జరిగే చర్చ చూశాను. టీవీ ఛానల్స్‌లో స్క్రోలింగ్ చూస్తున్నా….వైసీపీ నేతలు ఎప్పుడు మాట్లాడినా గొడవపడ్డారు. వాళ్ల మంత్రులు రావటం.. మనవాళ్లు గొడవకు దిగడం అంతా చూశా’నని చెప్పారు. దీనికి ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు మరింత ఉత్సాహం ప్రదర్శిస్తూ.. ‘అశోక్‌బాబులో రౌడీని చూశాం.. మంత్రులు వచ్చినప్పుడు ఆయన ఏయ్.. ఏయ్ అని బాగా అరిచారు.. కొంచెం ఉంటే కొట్టేవాడు.. బెజవాడ రౌడీయిజం చూపెట్టాడు…అని చంద్రబాబుకు వివరించారు.
అయితే పార్టీ సభ్యులు రౌడీయిజం చేశామని చెబుతుంటే వారించాల్సిన చంద్రబాబు.. ఎంతో ఉత్సాహంగా కన్పించారు. కాగా పెద్దల సభలో హుందాగా ఉండాలని చెప్పకుండా వారిని చంద్రబాబు ప్రశంసించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మొత్తంగా మండలిలో రౌడీయిజం ప్రదర్శించామని టీడీపీ ఎమ్మెల్సీలు గర్వంగా చెప్పుకోవడం..చంద్రబాబుకు మెచ్చుకోవడం చూస్తుంటే..తాను అనుకున్నది సాధించడం కోసం బాబు ఎంతకైనా దిగజారుతాడని మరోసారి రుజువైంది. ప్రస్తుతం ఈ వీడియో ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.