Home / ANDHRAPRADESH / స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన పవన్ కల్యాణ్…?

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన పవన్ కల్యాణ్…?

ఏపీలో స్థానిక ఎన్నికల సమరం మొదలు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, నెలరోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్ట్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జగన్ సర్కార్ 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సమాయాత్తం అవుతోంది. గత 9 నెలలుగా రోజుకో ఆరోపణతో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నామని, ఇక మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామని ఇప్పటి నుంచే కలలు కంటున్న టీడీపీ కూడా ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తోంది. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వైసీపీ మళ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా జనసేన పార్టీ పరిస్థితి అయోమయంగా ఉంది.

 

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతో జనసేన పార్టీ మరింత దయనీయంగా మారింది. స్వయంగా తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం పవన్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది. మరోవైపు చంద్రబాబుకు తొత్తు అనే ముద్ర పవన్‌ను ఇప్పట్లో వీడేలా లేదు…పవన్ కల్యాణ్ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా…ఇంకా చంద్రబాబుకు రహస్య స్నేహితుడిగా ఆయన కదలికలు ఉన్నాయి. జనసేనతో పొత్తు పెట్టుకున్నా బీజేపీ నేతలు పవన్‌ను నమ్మడం లేదు..పవన్ ఎప్పటికీ చంద్రబాబు తాబేదారు అనే భావన బీజేపీలో నెలకొంది. అందుకే పొత్తు ఉన్నా ఇరుపార్టీలు ఉమ్మడిగా ఒక్క బలమైన కార్యక్రమం చేయలేకపోయారు. మరోవైపు ఎన్నికల తర్వాత ఒక్కో కీలక నేత నుంచి పార్టీ నుంచి నిష్క్రమించడం జనసేన పార్టీకి మైనస్‌గా మారింది. ఆకుల సత్యనారాయణ, అద్దేపల్లి శ్రీధర్, పార్టీ వ్యవస్థాపక సభ్యుడు రాజు రవి, జేడీ లక్ష్మీ నారాయణ వంటి కీలక నేతలు పార్టీకి గుడ్‌ బై చెప్పడంతో జనసేన పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన క్యాడర్ ఉత్సాహపడుతున్నా..వారికి వెన్నుదన్నుగా ఉండి..సారథ‌్యం వహించే నాయకులు జనసేన పార్టీలో లేరు..ఉన్న ఒక్క ఎమ్మెల్యే వైసీపీకి జై కొట్టడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయాలకు తాత్కాలికంగా ప్యాకప్ చెప్పి..మళ్లీ మేకప్పు వేసుకుని వరుస సిన్మాలు చేస్తున్నారు. పవన్ సిన్మాల్లో బిజీ అయిపోవడంతో జనసేనలో ఒక్క నాదెండ్ల మనోహర్ మాత్రమే పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పవన్ చేతులెత్తేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తుతో పోటీ చేసినా..మహా అంటే పది స్థానాల్లో గెలిస్తే గొప్పే…ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీల మధ్యే నెలకొంది. ఒకవేళ ఒకట్రెండు స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలిచినా..స్థానికంగా ఉన్న పరిస్థితులే తప్పా…పవన్ ఫ్యాక్టర్ పనిచేయదు.. బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో పవన్ డైరెక్ట్‌గా చెప్పకున్నా.. మరోసారి స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి.. ఇన్‌డైరెక్ట్‌గా టీడీపీ అభ్యర్థులకు సహకరించాల్సిందిగా తన పార్టీ శ్రేణులను కోరే అవకాశం ఉంది.

 

అదీగాక స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజంగానే పోటీ చేయాలని పవన్ భావించినా నామినేషన్ల ప్రక్రియకు, ఎన్నికలకు 10, 15 రోజులు గ్యాప్‌ కూడా ఉండదు..ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేయడం పవన్‌కు దాదాపుగా అసాధ్యమే..అదీ కాక ఇప్పుడు పవన్ వరుస సిన్మా షూటింగ్‌లలో బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్‌, క్రిష్ మూవీ‌లకు పవన్ వరుసగా కాల్షీట్లు ఇచ్చాడు..ఇప్పటికే పవన్ కల్యాణ్‌ తీరుపై వకీల్ సాబ్ టీమ్ అసహనంగా ఉంది. పవన్ షూటింగ్‌లు ఎగ్గొడితే మిగతా ఆర్టిస్టుల కాల్షీట్లు కూడా వేస్టయి…నిర్మాతలు కోట్లలో మునిగిపోతారు…దీంతో పవన్ అన్నింటికి ప్యాకప్ చెప్పేసి…ఓన్లీ మేకప్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది. సో…ఎటూ చూసినా పవన్ కల్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే చేతులెత్తేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పవన్ పరిస్థితి చూసి…ఆల్ ప్యాకప్…ఓన్లీ మేకప్‌…దట్స్ ద ప్యాకేజీ బ్యూటీ అంటూ ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు.