వచ్చే రాజన్న రాజ్యంలో నవరత్నాల పథకాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు వెలగాలి…ప్రతి పేదింట్లో నా ఫోటో ఉండాలి..అంటూ పాదయాత్రలో నాటి ప్రతిపక్షనాయకుడిగా జగన్ పదే పదే ఈ మాటలు చెబుతుండేవారు. ఆయన అనుకున్నట్లుగానే రాజన్న రాజ్యం వచ్చేసింది. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో నవ్యాంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి పేదింటిలో సంతోషం వ్యక్తమవుతుంది. అవ్వాతాతలకు పింఛన్లు, పిల్లల చదువు కోసం అమ్మలకు అమ్మఒడి, చదువుకునే కాలేజీ విద్యార్థులకు జగనన్న విద్యా వసతి దీవెన, రైతన్నలకు రైతు భరోసాకింద పెట్టుబడిసాయం, పేదలకు నాణ్యమైన బియ్యం, ఆటో కార్మికులకు ఏటా 10 వేలు, మత్స్యకారులకు 10 వేలు, ఉగాది నుంచి పాతిక లక్షలకు పైగా పేదలకు సొంతింటి స్థలాలు…ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 9 నెలల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలతో తండ్రి వైయస్‌ను మరిపిస్తున్నారు సీఎం జగన్. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ ఫలాలను అందుకుంటున్న పేదలు సీఎం జగన్‌ను దేవుడిలా కొలుస్తున్నారు. ఇక 30 ఏళ్లు పాలించాలి .. ప్రతి పేదింటిలో తన ఫోటో ఉండాలన్న జగన్ ఆకాంక్ష ఈ 9 నెలల్లోనే ఫలించింది. ఓ నిరుపేద కుటుంబానికి చెందిన 14 ఏళ్ల చిన్నారి మోహిత స్వయంగా సీఎం జగన్ ఫోటోను తన ఇంటిలో పెట్టుకుని దేవుడిలా కొలుస్తున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
తాజాగా శ్రీకాకుళం జిల్లా, కోట బొమ్మాళి గ్రామానికి చెందిన సకలబర్తుల త్రినాథరావు కుమార్తె చిన్నారి మోహిత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాన్ని తనకు ఇవ్వాలని, తన ఇంట్లో పెట్టుకుంటానని వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ను అడిగింది. దీంతో దువ్వాడ ఆమెకు సీఎం చిత్రపటాన్నిఅందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. సుమారు 10 సంవత్సరాల క్రితం కోటబోమ్మాళి గ్రామానికి చెందిన సకలబర్తుల త్రినాథరావు కుమార్తె మోహితకు రెండు చెవులు వినిపించక ఇబ్బంది పడుతున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కలసి తమ సమస్యను వివరించారు. దానిపై స్పందించిన ఆయన మోహితకు ఆస్ట్రేలియా డాక్టర్లతో వైద్యం చేయించి, వినిపించేందుకు వీలుగా చెవిలో మిషన్ ఏర్పాటు చేశారు. అలాగే వెలుపల వైపు మరో మిషన్ ఏర్పాటు చేశారు. అయితే వెలుపలి వైపు ఏర్పాటు చేసిన మిషన్ 10 సంవత్సరాలే పనిచేస్తుందని చెప్పారు. దీంతో గతేడాది నవంబర్ 23వ తేదీన మిషన్ పని చేయడం ఆగిపోయింది. మరలా ఆ అమ్మాయికి అదే సమస్య వచ్చింది. ప్రస్తుతం మోహిత 9వ తరగతి చదువుతోంది. మరలా ఆ పాపకు సక్రమంగా వినిపించాలంటే మిషన్ ఏర్పాటు చేయాలని హైదరాబాద్ అపోలో ఆస్పత్రి డాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో పాన్‌షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న త్రినాథరావు అంత డబ్బు లేకపోవడంతో కుమిలిపోయాడు.
ఆ సమయంలో కొంతమంది స్నేహితుల సాయంతో వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ వద్దకు వెళ్లారు. అనంతరం దువ్వాడతో జరిగిన విషయం అంతా వివరించడంతో ఆయన చలించిపోయారు. ఈ విషయాన్ని ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షలు విడుదల చేశారు. దీంతో చిన్నారి మోహితకు రూ. 2 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్‌ను పార్టీ కార్యాలయంలో దువ్వాడ శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ కుమార్తెను దేవుళ్లులా ఆదుకున్నారన్నారు. కాగా తనను సీఎం జగన్ ఆదుకోవడంతో చిన్నారి మోహిత ఎమోషనల్ అయింది. అందుకే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్‌తో పాటు ఏకంగా సీఎం జగన్ చిత్రపటం ఇవ్వాల్సిందిగా దువ్వాడ శ్రీనివాస్‌ను కోరింది. చిన్నారి కోరికకు ఆశ్చర్యపోయిన దువ్వాడ శ్రీనివాస్ వెంటనే రెండు లక్షల రూపాయల చెక్‌తో పాటు సీఎం జగన్ చిత్రపటాన్ని కూడా అందజేశారు. జగన్ చిత్రపటం అందుకున్న ఆ చిన్నారి ముఖం వెలిగిపోయింది. ఈ ఫోటోను తమ ఇంట్లో పెట్టుకుని ప్రతి రోజు సీఎం జగన్‌ను దేవుడిలా కొలుస్తామంటూ ఆ పాప భావోద్వేగానికి గురైంది. మొత్తంగా ప్రతి పేదింటిలో తన ఫోటో ఉండాలన్న జగన్ ఆకాంక్ష ఈ చిన్నపాపతో మొదలైంది. ఇంకా వచ్చే నాలుగున్నరేళ్లలో ప్రతి పేదింటిలో జగన్ ఫోటో చిరునవ్వులు చిందిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.