ఏపీలో మరికొద్దిరోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధంలో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచుతున్న, అమ్ముతున్న మద్యాని అరికట్టడానికి డీజీపీ ఆదేశాల మేరకు డిఎస్పీలు, సీఐ, ఎస్సైల ఎక్సైజ్ పోలీసు సిబ్బందితో కలిసి ఆపరేషన్ సురా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది మరియు ఎక్సైజ్ సిబ్బంది మొత్తం పలు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో గ్రామాలలో మెరుపుదాడులు నిర్వహించి, అక్రమ మద్యం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అక్రమ మద్యం అరికట్టేందుకు ఆపరేషన్ ‘సుర’ పేరిట దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా మద్యం లేదా నాటుసారా పంపిణీ చేస్తున్నట్లు, నిల్వ ఉంచినట్లు గానీ, తరలిస్తున్నట్లు గానీ సమాచారం ఉంటే పోలీస్ సిబ్బందికి సమాచారం తెలపాలని, అలా చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ1 నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు నిర్వహించారు. తెల్లవారు జామున ఐదు గంటల నుంచి ఈ దాడులు మొదలయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వినీత్ బ్రిజ్ లాల్ ఆదేశాలతో 200 బృందాలు రంగంలోకి దిగాయి.
