కరోనా వ్యాప్తి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి వాయిదా వేయడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వయంగా సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టి కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎవరినైనా సంప్రదించారా అని సూటిగా ప్రశ్నించారు. కనీసం హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలను అయినా పిలిచి మాట్లాడారా అని నిలదీశారు. రమేష్‌కు చంద్రబాబు పదవి ఇచ్చి ఉండొచ్చు, వారిద్దరు ఒకే సామాజిక వర్గం కావొచ్చు.. కానీ ఇంత వివక్ష చూపడం ధర్మమేనా అని సీఎం జగన్ ప్రశ్నించారు.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు రాష్ట్ర చీఫ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చౌదరిపై నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లాకు చెందిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చౌదరి అనే ఐఏయస్ అధికారిని రిటైర్ అయిన తర్వాత కూడా కేవలం తన సామాజికవర్గం అనే కారణంతోనే 2016 లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా నియమించారని అంబటి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వీర్యమైన టీడీపీ క్యాడర్.. స్థానిక సంస్థలలో ఎన్నికలలో పోటీ చేయడం అనవసరం అన్న నిర్ణయానికి వచ్చారని అంబటి తెలిపారు. దీంతో చాలాచోట్ల ఏకగ్రీవాలు జరుగుతున్నాయని అంబటి వివరించారు. అయితే గతంలో కూడా టీడీపీ హయాంలో ఆ పార్టీకి ఏకగ్రీవాలు వచ్చాయని..కాకపోతే ఈ సారి వైసీపీకి అత్యధికంగా వచ్చాయని అంబటి అన్నారు. అయితే ఎన్నికల కమీషనర్ కరోనా వైరస్‌తో ఎన్నికలు వాయిదా వేశామని చెబుతూనే మాచర్ల వంటి ఘటనలను పరిశీలిస్తున్నామని చెప్పడంలో తప్పులేదని అంతే కాని కంట్లో నలుసు పడిందని..కన్ను పీకేసుకుంటారా అని అంబటి ప్రశ్నించారు.
ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా వైరస్ వల్ల వాయిదా పడలేదు..క్యాస్ట్ వైరల్ వల్ల వాయిదా పడ్డాయని..ఇది వాస్తవం అని అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కాపాడుకోవడం కోసమో..టీడీపీని కాపాడుకోవడం కోసమో ఒక రాజ్యంగబద్ధ వ్యవస్థలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ చౌదరి ఇలా ఎన్నికలను వాయిదా వేశారని అంబటి ఆరోపించారు. కరోనా వైరస్ వ్యాప్తిపై ఎలక్షన్ కమీషన్ అధికారిగా ఒక కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారిని సంప్రదించాల్సి బాధ్యత మీకు ఉన్నదా లేదా అని రమేష్‌కుమార్ చౌదరిని అంబటి నిలదీశారు. అసలు ఎవరికి తెలియకుండా స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రహస్యంగా డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఏం వచ్చిందో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చౌదరి జవాబు చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. ఒక రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన రమేష్ కుమార్ చౌదరి కుట్రపూరితంగా వ్యవహరించారని అంబటి విమర్శించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఎన్నికలు వాయిదా వేయమంటే వేస్తారా అని అంబటి నిమ్మగడ్డపై మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలపై జరుగుతున్న కుట్రలో చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిలు భాగస్వాములని..ఈ కుట్రలో ఇంకా ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వారందరూ త్వరలోనే బయటకు వస్తారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా కుట్రలో చంద్రబాబు, ఎన్నికల అధికారి రమేష్‌కుమార్ చౌదరి చేసిన కుట్ర ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.