అమరావతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీఎల్పీ డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుపడుతూ గందరగోళం సృష్టించడమే సీఎం ఆగ్రహానికి కారణమైంది.
అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లో సీఎం జగన్, టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, ఇతర నేతలు పాల్గొన్నారు. సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుతగిలిన అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సమయంలో అచ్చెన్నాయుడిని ఉద్దేశిస్తూ సీరియస్ అయ్యారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడటం మంచి పద్ధతి కాదని.. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదన్నారు. గవర్నర్ వయసులో పెద్దవారని.. ఆయనకు గౌరవం ఇవ్వాలని సూచించారు.
ఈ నెల 25 వరకు బడ్జెట్ సమావేశాలు: మరోవైపు ఈనెల 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ మీటింగ్‌లో నిర్ణయించారు. ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపసూచకంగా ఈనెల 9న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. బీఏసీ సమావేశం తర్వాత ఏపీ కేబినెట్ సమావేశమైంది. కేబినెట్ మీటింగ్‌లోనూ గౌతమ్‌రెడ్డికి మృతికి సంతాపం తెలిపారు. సీఎం జగన్‌తో పాటు మంత్రులు రెండు నిమిషాల మౌనం పాటించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ప్రభుత్వ పరంగా ఎలా ముందుకెళ్లాలి.. తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ మీటింగ్‌లోనే సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది.