Political జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై సెప్టెంబర్ త్రైమాసికం నిధులను ముఖ్య మంత్రి వైఎస్ జగన్ బుధవారం విడుదల చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన ఈ కార్యక్రమం అనంతరం మాట్లాడిన జగన్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును తీవ్రంగా విమర్శించారు..
జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై సెప్టెంబర్ త్రైమాసికం కింద జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా.. “కుటుంబాల తలరాత మారాలన్నా.. పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గం. పేదరికం చదువులకు అవరోధం కావొద్దని దివంగత నేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తెచ్చారు. ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తపన పడ్డారు. ఆతర్వాత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరుగార్చాయి. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నాం.. ” అని సీఎం జగన్ చెప్పారు.
అలాగే దగా చేసిన చంద్రబాబు మహిళా సాధికారత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను దగా చేసి నేడు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నరన్నరు.. “మనం రాక్షసులు, మారీచులతో యుద్ధం చేస్తున్నాం. దుష్టచతుష్టయం మాటలు నమ్మొద్దు. మీ బిడ్డ పత్రికలు, చానళ్లు, దత్తపుత్రుడ్ని నమ్ముకోలేదు. మీ బిడ్డకు నిజాయితీ ఉంది.. చెప్పిందే చేసి చూపిస్తాడు. ప్రజల్ని, ఆ దేవుడ్ని మీ బిడ్డ నమ్ముకున్నాడు. అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా గమనించండి. మంచి జరిగితే మీ జగనన్నకు తోడుగా ఉండండి” అని సీఎం జగన్ ప్రజల్ని కోరారు.