జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సీఎం జగన్‌కు జై కొట్టారు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై మాట్లాడుతూ సీఎం జగన్ దేవుడు అంటూ రాపాక ప్రశంసలు కురిపించారు. అంతే కాదు ఆటో , క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయం ప్రకటించి ఆ మేరకు నిధులు విడుదల చేసిన సందర్భంగా రాపాక స్వయంగా సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి సంచలనం సృష్టించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన జగన్ సర్కార్ నిర్ణయాన్ని అసెంబ్లీ వేదికగా సమర్థించారు. తాజాగా ఎస్సీ, ఎస్టీ లకు వేర్వేరే కమీషన్లు ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అసెంబ్లీ వేదికగా అభినందించారు. ఇవాళ అసెంబ్లీ రాపాక మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అని కొనియాడారు. ఎస్సీ,. ఎస్టీలకు వేర్వేరు కమీషన్లను స్వాగతిస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో దళితులు అభివృద్ధి చెందుతారన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులు చాలా దారుణమన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కుల వివక్షత తీవ్రంగా ఉందన్నారు. వెనుకబడిన వర్గాలకు సమాజంలో సమాన స్థానం కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. దళితులను సామాజికంగా, ఆర్థికంగా బాగుపర్చాలని వరప్రసాద్ కోరారు. ఇప్పటికే రాపాక పవన్ కల్యాణ్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పవన్ కల్యాణ్ కాకినాడలో చేపట్టిన సౌభాగ్య దీక్షకు రాపాక హాజరు కాలేదు. దీంతో జనసేన పార్టీ అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో రెండు చోట్ల ఓడిపోయిన వాళ్లు తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చేది ఏంటీ..తనకే ఆ పార్టీలో ఉండడం ఇష్టం లేదని పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. అంతే కాదు పవన్ కల్యాణ్‌కు, తనకు విబేధాలు ఉన్నాయని తేల్చి చెప్పారు. త్వరలో పార్టీ మారే విషయంపై ఆలోచిస్తా అన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా మరోసారి సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించడంతో రాపాక త్వరలోనే వైసీపీలో చేరడం ఖాయమని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు రాపాక తీరుపై జనసేన పార్టీ ఆగ్రహంగా ఉంది. ఒక వేళ రాపాక సస్పెన్షన్ చేస్తే…వంశీ తరహాలో ప్రత్యేక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొనసాగే అవకాశం ఉంది. దీంతో రాపాక విషయంలో పవన్ కల్యాణ్ ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నాడు. మొత్తంగా రాపాక సీఎం జగన్‌పై మరోసారి ప్రశంసలు కురిపించడం హాట్ టాపిక్‌గా మారింది.
