Home / ANDHRAPRADESH / చంద్రబాబు అను”కుల” మీడియాకు మంత్రి కొడాలి నాని చురకలు..!

చంద్రబాబు అను”కుల” మీడియాకు మంత్రి కొడాలి నాని చురకలు..!

ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా .. సేవ్ అమరావతి పేరుతో గత నెల రోజులుగా గగ్గోలు పెడుతున్న చంద్రబాబు, ఆయన అనుకుల మీడియాకు మంత్రి కొడాలి నాని చురకలు అంటించారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వరకు గుంటూరు, కృష్ణా జిల్లాలు అభివృద్ది చెందే ఉన్నాయని తెలిపిన నాని అమరావతి వల్ల ఈ రెండు జిల్లాలకు పెద్దగా ఒరిగేదేం లేదని స్పష్టం చేశారు. తొలుత మూడు రాజధానుల బిల్లును ఈ బిల్లును ప్రవేశ పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రి  కృతఙ్ఞతలు తెలిపారు.

 

అయితే మూడు రాజధానుల అంశాన్ని సామాజికవర్గ కోణంలో చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని నాని విమర్శించారు. రాజధాని తరలిపోతే కమ్మ కులస్తులకు అన్యాయం జరుగుతుందని..చంద్రబాబుకు భజన చేసే మీడియాధిపతులు రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు తదితరులు అసత్య ప్రచారం చేస్తున్నారని నాని మండిపడ్డారు. కేవలం కమ్మవారి కోసమే అమరావతిలో రాజధాని పెట్టారా..? అని బాబును నిలదీశారు. డబ్బా మీడియా, చెత్త పేపర్లతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. ఏపీకి మధ్యలో ఉంటేనే అమరావతి అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు చెప్తున్నారు…మరి భారత దేశానికి ఢిల్లీ మధ్యలో ఉందా..? అని ప్రశ్నించారు.

 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల భూములు వద్దని, ప్రభుత్వ భూములను తీసుకోవాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా చెప్పారని ఈ సందర్భంగా నాని గుర్తు చేశారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించడం లేదని..కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాలే కోసమే ఇంతలా పాకులాడుతున్నాడని నాని ధ్వజమెత్తారు. ఇది అసలు అమరావతి కాదు… ఇది చంద్రబాబు అమరావతి అని ఎద్దేవా చేశారు…సేవ్ అమరావతి అంటూ.. చంద్రబాబు పిట్టల దొరలా ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించారు. మొత్తంగా మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న చంద్రబాబుకు, ఆయన అనుకుల మీడియాకు మంత్రి కొడాలి నాని అసెంబ్లీ వేదికగా చురకలు అంటించారు.