Home / ANDHRAPRADESH / ఆ విషయంలో ఆర్.నారాయణమూర్తిని చూసైనా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు మారుతారా..!

ఆ విషయంలో ఆర్.నారాయణమూర్తిని చూసైనా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు మారుతారా..!

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద తల్లిదండ్రులు, విద్యావేత్తలు, హర్షం వ్యక్తం చేశారు. కాని టీడీపీ అధినేత చంద్రబాబుతో, ఆయన పుత్రరత్నం లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు అమ్మభాషను చంపేస్తున్నారు… తెలుగు భాషకు జగన్ సర్కార్ అన్యాయం చేస్తుందని గగ్గోలు పెట్టారు. ఇక బాబుగారి అనుకుల మీడియా అయితే..ఇంగ్లీష్ మీడియంతో తెలుగు భాషకు ఏదో జరగరాని ఉపద్రవం జరగబోతుందని పచ్చ కథనాలు పుంఖానుపుంఖాలుగా వండివార్చాయి. పవన్ కల్యాణ్ అయితే మన నుడి..మన నది అనే కార్యక్రమమే మొదలెట్టాడు. అయితే ఇంగ్లీష్ మీడియంపై సామాజిక సృహ ఉన్న నటుడు, విప్లవ సినిమాల నిర్మాత దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి స్పందించారు.

తాజాగా శ్రీకాళుళంలో ఎమ్మెల్సీ జుపూడి ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ… సీఎం జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని నారాయణమూర్తి కొనియాడారు. తాను ఎర్రసముద్రం సినిమాలో పేర్కొన్నట్టు… పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలనే నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌‌కు సెల్యూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంగ్ల విద్య ద్వారానే పేద ధనిక అంతరాలు తగ్గుతాయని చెప్పిన ఆర్‌.నారాయణమూర్తి …ప్రస్తుత పరిస్థితుల్లో బడుగు, బలహీన వర్గాలకు ఇంగ్లీష్ విద్య అవసరమని గుర్తుచేశారు. తెలుగు భాష అమ్మలాంటిదని ఇంగ్లీష్ భాష నాన్నలాంటిదని తెలిపారు. ఇంగ్లీష్ విద్య తీసుకువచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు అందరూ రుణపడి ఉండాలని అన్నారు. అట్టడుగు వర్గాల పిల్లల భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, ఇంగ్లీష్ మీడియం విషయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు.  అంబేడ్కర్ ఆశయ సాధన సీఎం జగన్‌తోనే సాధ్యమని నారాయణమూర్తి స్పష్టం చేశారు.

ఇక వికేంద్రీకరణ అంశంపై కూడా ఆర్. నారాయణ మూర్తి స్పందించారు. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. అధికార వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అవుతాయని చెప్పారు. అమరావతి రాజధాని ఉండగా కర్నూలుకు అన్యాయం జరిగిందని..కాని ఇప్పుడు మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌ను ఈ సందర్భంగా ఆర్‌.నారాయణమూర్తి అభినందించారు. మొత్తంగా ఇంగ్లీష్ మీడియం, మూడు రాజధానులపై పీపుల్స్ సీఎం జగన్‌పై పీపుల్స్ స్టార్ ప్రశంసలు కురిపించడం సినీ, రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి తర్వాత మూడు రాజధానులను టాలీవుడ్ నుంచి సమర్థించింది ఆర్‌.నారాయణమూర్తి కావడం విశేషం. ఆర్‌.నారాయణమూర్తి వ్యాఖ్యలు చూసిన తర్వాత అయినా ఇంగ్లీష్ మీడియంను, మూడు రాజధానులను గుడ్డిగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మారండని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.