ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు + మంత్రి పదవి..!! మా ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి వంద కోట్ల రూపాయలతోపాటు మంత్రి పదవి ఆశ చూపి లాక్కుంటున్నారు. అంతే కాకుండా, కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉందన్న ధీమాతో రాష్ట్రంలోని బీజేపీ నేతలు విచ్చల విడిగా చెలరేగిపోతూ తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని జేడీఎస్ చీఫ్ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, కుమార స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్పపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిచింది కేవలం 104 అసెంబ్లీ సీట్లే అయినా.. ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను గవర్నర్ ఆహ్వానించడం బాధాకరమన్నారు. గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తి.. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు ఇప్పుడు కాకపోయినా.. రానున్న రోజుల్లో బీజేపీకి బుద్ధి చెబుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేడీఎస్ చీఫ్ కుమార స్వామి. బీజేపీ చేస్తున్న కుట్రలపై సుప్రీం కోర్టు సాక్షిగా న్యాయం కోసం పోరాడతామన్నారు.