వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న జగన్‌పై ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు చంద్రబాబు సర్కార్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. కాగా, వైఎస్ జగన్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
కాగా, జగన్ పాదయాత్రను ఉద్దేశించి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంకు చెందిన ఓ విద్యార్థిని తనదైన శైలిలో స్పందించింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను వైసీపీకే ఓటు వేస్తానని స్పష్టం చేసింది. అంతేకాకుండా, వైఎస్ జగన్‌కు ఎందుకు ఓటు వేయాలో కూడా చెప్పింది. పాదయాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే.. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌కు.. నేడు వైఎస్ జగన్‌కు మాత్రమే ప్రజల మద్దతు దక్కిందని, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ జగన్ పాదయాత్ర చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను \ప్రస్తుతం బీటెక్ పూర్తి చేశానని, తన ఇంట్లోని ముగ్గురు కూడా వైఎస్ఆర్ ఇచ్చిన ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులతోనే చదువులను పూర్తి చేశామని తెలిపింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే తమకు ఉద్యోగాలు వస్తాయని, జగన్ ఇచ్చిన మాట తప్పే వ్యక్తి కాదని, జగన్ మాటపై నమ్మకముందని చెప్పింది.
సీఎం చంద్రబాబు గత ఎన్నికల సమయంలో ఓట్ల కోసం.. జాబు రావాలంటే.. బాబు రావాలని ప్రచారం చేయించుకున్నారని, కానీ, నేడు జాబు రావాలంటే.. బాబు పోవాలనే నినాదాన్ని ఏపీ యువత నమ్ముతుందని తెలిపింది. కేవలం బీటెక్ పూర్తి చేసిన వారికే కాకుండా, ఎంటెక్, డిగ్రీ వారికి కూడా ఉద్యోగాలు రావడం కష్టతరంగా మారిందని, వారందరికీ ఉద్యోగాలు కల్పించాలంటే ఒక్క జగనన్నకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పింది.