పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలపై ఒక దివ్యాంగుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి ఇళ్లు, బ్యాంకు నుంచి అప్పు మంజూరు కాకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని పెరపల్లి మండలం వడ్లూరుకు చెందిన శివరావు అనే దివ్యాంగుడు అన్నారు. ఈ మేరకు ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవాల్టి సాయంత్రంలోగా తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించాడు.
అయితే, దివ్యాంగుడు శివరావు తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్న మాటలు ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. నా పేరు శివరావు. మాది పెరపల్లి మండలం వడ్లూరు గ్రామం. నేనొక దివ్యాంగుడిని. 2014 జన్మభూమి రెండో విడతలో హౌసింగ్ లోన్ పెట్టుకున్నానండి. హౌసింగ్‌లోన్ పెట్టుకున్న తరువాత 2015 వచ్చే సరికి వడ్లూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీ సభ్యులు శ్రీనుబాబు, బుల్లబ్బులు, పంపనంజి.. వీరు ముగ్గురు ముఖ్య కార్యదర్శులు. వారి చుట్టూ తిరగడం జరిగింది. అదిగో.. వస్తుంది.. ఇదిగో వస్తుంది అన్నారు. ఉండ్రాజువరం మండలం హౌసింగ్ ఏఈ శివరామరాజుని పంపించడం జరిగింది. ఆయన కూడా ఏదో కల్లబొల్లి కబుర్లు చెప్పి.. ఏదో లెటర్ ఇచ్చి వెళ్లిపోయారు. అలా ఐదు సార్లు జరిగింది. తరువాత ఉండ్రాజువరం మండలం ఈవోపీఆర్డీ కూడా వచ్చారు. ఆయన కూడా తన వల్లేమి కాదని చెప్పేసి వెళ్లిపోయారు. వడ్లూరులో తెలుగుదేశం గ్రామ కమిటీ రోడ్లు వేయడం లేదు.. డ్రైనేజీలు లేవు వంటి సమస్యలను పై అధికారులకు చెప్పేందుకు 150 మందిని తీసుకెళ్లడం జరిగింది. వాటన్నిటిని మనసులో పెట్టుకుని నాపై దాడి చేసేందుకు కొంతమంది రౌడీలను మా ఇంటిపైకి పంపడం జరిగింది. నేను దివ్యాంగుడిని.. నేను ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాను. ఏ ఉద్యోగం లేదు. రేపు సాయంత్రంలోగా నా హౌసింగ్ లోను.. నేను వ్యాపారం చేసుకునేందుకు బీసీ లోను ఇవ్వకపోతే పెట్రోలు ఒంటిపై పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను. ఈ విషయం అందరికి వెళ్లేలా షేర్ చేయండి అంటూ ఆ దివ్యాంగుడు ఆవేదనతో వేడుకున్నాడు.