ఏపీలో మహిళలసౌ లైంగిక దాడులు ఆగడం లేదు . అత్యంత దారుణంగా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నూజివీడు మండలంలో పొలంలో కాపలా ఉంటున్న ఓ కుటుంబంలోని యువతిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూజివీడు రూరల్ ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా కోసూరు మండలానికి చెందిన ఒక కుటుంబం నూజివీడు మండల పరిధిలోని ఓ తోటలో కాపలాగా ఉంటోంది. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉండగా.. మొదటి, మూడో కుమార్తెకు పెళ్లి చేశారు. రెండో కుమార్తె(21)తో కలిసి ఇక్కడ ఉంటున్నారు. ఆదివారం పని మీద నూజివీడుకు వచ్చారు. ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడుకు చెందిన పిన్నిబోయిన శ్రీనివాసరావు (42) అనే వ్యక్తి, వీరికి సమీపంలోనే జామ తోటను లీజుకు తీసుకున్నాడు. యువతి తల్లిదండ్రులు లేని విషయాన్ని గమనించిన శ్రీనివాసరావు.. ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు.. తీవ్ర రక్తస్రావంతో ఉన్న కుమార్తెను చూసి బెంబేలెత్తిపోయారు. వెంటనే తోట యజమానికి సమాచారం ఇచ్చి, కుమార్తెను విజయవాడలోని ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారంతో రూరల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో కోలుకుంటోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. అక్కడ తీవ్ర రక్తస్రావం అయిన పరిస్థితిని చూసి చలించిపోయారు. నిందితుడిని తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు.
