ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అనుమానస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఇవాళ తీవ్ర అస్వస్థతకు లోనైన కోడెల శివప్రసాద్‌రావును ఆయన గన్‌మెన్, డ్రైవర్‌లు బసవతారకం ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలోనే ఆయన మరణించారు. అయితే కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన భౌతిక దేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతికి సంతాపం తెలిపిన సీఎం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి స్పీకర్‌గా కోడెల శివప్రసాద్‌రావు కలకాలం గుర్తుండిపోతారని ఈ సందర్భంగా జగన్ అన్నారు. కాగా కోడెల మరణవార్తతో ఆయన ఇంటికి కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. నర్సరావుపేటలో భారీగా పోలీసులను మోహరించారు. పల్నాడులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హై అలర్ట్ ప్రకటించారు. 144 సెక్షన్ విధించారు.
