ఏపీలో జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా వైయస్ఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కింద తొలి విడతలో.. సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వారికి ఉచితంగా కంటి పరీక్షలతో పాటు కళ్లద్దాలు కూడా ప్రభుత్వమే పంపిణీ చేయనుంది. ఈ మేరకు నవంబర్ 8న గుంటూరు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ నగరపాలక సంస్థ ఉచిత కళ్లజోళ్ల పంపిణీ స్టాల్స్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి స్వయంగా సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ ఇచ్చిన కళ్ల జోడును పెట్టుకుని స్వయంగా పెట్టుకుని పరిశీలించారు. నవ్వుతూ.. బాగుందన్నా కళ్లజోడు అంటూ సీఎం జగన్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కళ్లజోళ్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. కళ్లజోడుతో హుందాగా ఉన్న సీఎం జగన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
