ఏపీలో పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలన్న సదుద్దేశంతో జగన్ సర్కార్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకుంది. తొలుత వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తారు. ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుతూ పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తారు. అయితే ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తెలుగును ప్రభుత్వం చంపేస్తుందంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతుంటే, మాతృభాషను, మృత భాషను చేయద్దంటూ పవన్ విమర్శిస్తున్నాడు. తాజాగా బాబు, పవన్‌ల విమర్శలపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చిన్న మెదడు చితికిపోయి మాట్లాడుతున్నారని గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇక నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే చంద్రబాబు, పవన్ నానా రచ్చ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ భవన్ స్కూళ్లలో, వెంకయ్య నాయుడు స్వర్ణభారతిలో, రామోజీరావు స్కూళ్లలో, చంద్రబాబు బినామీ నారాయణ పాఠశాలలో ఉన్నది ఇంగ్లీష్ మీడియం కాదా’ అని ప్రశ్నించారు. చంద్రబాబు బినామీలకు నష్టం వస్తుందన్న భయంతోనే ఇంగ్లీష్ మీడియాన్ని వద్దు అంటున్నారే తప్ప భాష మీద ఉన్న ప్రేమతో కాదని..ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. మొత్తంగా ఇంగ్లీష్ మీడియంపై పార్టనర్లు చిన్నమెదడు చితికిపోయి మాట్లాడుతున్నారంటూ గడికోట చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అవును..జగన్ దెబ్బకు చంద్రబాబుకు అధికారం పోవడంతో, ఆయన పార్టనర్ పవన్ కల్యాణ్‌కు రెండు చోట్ల ఓడిపోవడంతో చిన్నమెదడు చితికిపోయిందని.. అందుకే ప్రభుత్వానికి ఆరు నెలలు టైమ్ కూడా ఇవ్వకుండా రోజూ ఏదో ఒక టాపిక్‌పై అడ్డగోలుగా దుమ్మెత్తిపోస్తున్నారని..నెట్‌జన్లు సెటైర్లు వేస్తున్నారు.
