అణగారిన వర్గాలకు సమాన హక్కు ఉండాలంటూ పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త..మహాత్మా జ్యోతిబాపూలే అని ఏపీ సీఎం జగన్ కొనియాడారు. నేడు సామాజిక అసమానతలపై పోరాడిన గొప్ప సంఘసంస్కర్త, అట్టడుగు వర్గాల విద్య కోసం పాటుపడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపూలే వర్థంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పులే విగ్రహానికి వైఎస్ జగన్ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు . అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు సమాన హక్కు ఉండాలంటూ జ్యోతిరావు పూలే చేసిన పోరాటం గుర్తుచేశారు. బలహీన వర్గాల్లో మహిళలు చదువుకోవాలని ఆరాటపడిన వ్యక్తి పూలే అని కొనియాడారు. దళిత వర్గం నుంచి వచ్చిన అంబేడ్కర్, పూలేలు అమలు పరిచిన విధానాలను ఇప్పటికి ఆచరిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోని పౌరుల్లో ఎక్కువ, తక్కువ అనే బేధాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు పూలే పాటు పడ్డారని తెలిపారు. బలహీన వర్గాల కుటుంబాల నుంచి ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు రావాలని ఆలోచన చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు. పేద విద్యార్థుల చదువుకు ఎంత ఖర్చైనా భరిస్తామని మహానేత వైఎస్సార్ భరోసా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీల అభ్యున్నతి కోసం బీసీ డిక్లరేషన్ చేశామని, అందుకోసం బడ్జెట్‌లో వారి సంక్షేమం కొరకు రూ. 15వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేస్తున్నాం. మా ప్రభుత్వంలో బలహీనవర్గాలకు చెందిన 60శాతం మందికి మంత్రివర్గంలో చోటు కల్పించామన్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు బలహీన వర్గాలకు చెందిన వారేనని తెలిపారు. జిల్లాలోని 19 మార్కెట్ యార్డుల్లో చైర్మన్ పదవులకు సంబంధించి 10 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
