దిశ ఘటన నేపథ్యంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లో ఉరిశిక్ష పడేలా జగన్ సర్కార్ దిశ బిల్లును తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. దిశ చట్టం తీసుకువచ్చిన సీఎం జగన్‌పై దిశ కుటుంబసభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, కృష్ణంరాజు, పూరీ జగన్నాథ్, జయసుధ,నాగచైతన్య, సుద్దాల అశోక్ తేజ వంటి సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. మహిళా సోదరిమణులకు,లైంగిక వేధింపులకు గురవుతున్న చిన్నారులకు ఈ దిశ చట్టం భరోసా ఇస్తుందని చిరంజీవి అన్నారు. ఇక దిశ చట్టం వల్ల నేరాలు తగ్గుతాయని సీనియర్ నటులు కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బిల్లు తీసుకొచ్చి జగన్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని హీరో వెంకటేశ్ కొనియాడారు. ఏపీ సీఎం జగన్ తెచ్చిన దిశ చట్టం ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని డైరెక్టర్ పూరీ జగన్ అన్నారు. 90శాతం ఈ రేప్ లు మద్యం మత్తులో జరుగుతాయని.. మద్యాన్ని కంట్రోల్ చేసి జగన్ ను మెచ్చుకోవాలంటూ కొనియాడారు. ఇక జీఎస్టీ వంటి వాటిల్లో తొందరగా నిర్ణయాలు తీసుకొని ఆడవాళ్లపై అత్యాచారాలపై ఆలస్యం చేయడం ఏంటని హీరో నాగచైతన్య ప్రశ్నించారు. ఇలాంటి దిశ చట్టాన్ని తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని యువ హీరో నాగచైతన్య అన్నారు. అలాగే ఏపీ సీఎం జగన్ తీసుకొచ్చిన దిశ చట్టం న్యూ ఇయర్ గిఫ్ట్ ను మహిళలు – ప్రజలకు ఇచ్చిందని సీనియర్ నటి జయసుధ ప్రశంసించారు.. జగన్ ఈ నిర్ణయం తీసుకొని అందరు సీఎంలకు మార్గదర్శకుడయ్యారని ఆమె అన్నారు. ఆరునెలల్లోనే జగన్ ఈ స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు.. నాలుగున్నరేళ్లలో ఆయన పాలన ఎంత డైనమిక్ గా ఉండబోతుందో ఈ సంఘటన రుజువు చేస్తోంది. మిగతా సీఎంలు ఆడవాళ్లకు ఇలాంటి న్యాయమే చేయాలని జయసుధ డిమాండ్ చేశారు. ఇక దేశంలోనే తొలిసారిగా ఇలాంటి చట్టం తీసుకువచ్చిన సీఎం జగన్‌కు జేజేలు పలుకుతున్నట్లు సీనియర్ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. మొత్తంగా మహిళల రక్షణ కోసం దిశ బిల్లును తీసుకువచ్చిన ఏపీ సీఎం జగన్‌కు టాలీవుడ్ జేజేలు పలుకుతోంది.
