ఏపీకి మూడు రాజధానుల అంశం టీడీపీలో గందగోళానికి దారితీస్తోంది. ఒక పక్క చంద్రబాబు, లోకేష్, రాజధానిలోని దేవినేని ఉమా, బోండా ఉమ వంటి టీడీపీ నేతలు మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా…రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు మాత్రం సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి గంటా, బాలయ్య అల్లుడు భరత్‌తో సహా విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుపై సీఎం జగన్ ప్రకటను స్వాగతిస్తూ..చంద్రబాబుకు ఓ తీర్మానం పంపారు. అయితే బాబు మాత్రం ఉత్తరాంధ్ర, సీమ టీడీపీ నేతల అభిప్రాయాలను తోసిపుచ్చుతూ అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలి..మూడు రాజధానులు వద్దనేలా వ్యాఖ్యలు చేస్తున్నాడు. తాజాగా ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేల తీర్మానంతో ఖంగు తిన్న బాబు వెంటనే బోండా ఉమతో ప్రెస్‌మీట్ పెట్టించి నవ్యాంధ్ర రాజధాని విషయంలో టీడీపీది సింగిల్ లైన్ విధానమని, అమరావతే రాజధాని అనే అంశానికి పార్టీ కట్టుబడి ఉందని చెప్పించాడు. అంతే కాదు…విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా బాబు బోండాతో కౌంటర్ ఇప్పించాడు. విశాఖ టీడీపీ నేతలు స్థానికత ఆధారంగా స్వాగతించారు కానీ తెలుగుదేశం పార్టీ స్టాండ్ మాత్రం అమరావతే రాజధాని అని బోండా ఉమతో చెప్పించాడు. మొత్తంగా మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ చంద్రబాబు తన సొంత పార్టీ నేతలకు కూడా క్లారిటీ ఇచ్చాడు. బోండాతో ప్రెస్‌మీట్ పెట్టించడంపై సీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాల కంటే చంద్రబాబుకు తన సామాజికవర్గ ప్రయోజనాల ముఖ్యమని తేలిపోయిందని వారు అంటున్నారు. అయితే మూడు రాజధానుల విషయంలో తమ ప్రాంత ప్రజల మనోభావాలకనుగుణంగా నడుచుకుంటామని, అవసరమైతే చంద్రబాబుపై తిరుగుబాటు చేయడానికి కూడా వెనుకాడేది లేదని ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు ముసుగు తీసేశాడు. తనకు సీమ, ఉత్తరాంధ్ర ప్రజల ప్రయోజనాల కంటే..తనకు తన సామాజికవర్గమే ముఖ్యమని మరోసారి బాబు బోండాతో ప్రెస్‌మీట్ పెట్టించి మరీ తేల్చి చెప్పాడు. మరి బాబు స్టాండ్‌పై మున్ముందు ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
