పెట్టుబడిదారులు మళ్లీ మళ్లీ పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీని తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఉన్న మంత్రి కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఐ.టీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కీలక రంగాలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఏకైక పాలసీగాని తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా ఢిఫెన్స్ రంగంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పెట్టుబడులు ఆకర్షించాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ, పరిశ్రమ శాఖలను ఒకతాటిపై తీసుకొచ్చి సమగ్రాభివృద్ధికి శ్రీకారం చుట్టడం ఒక మైలు రాయిగా నిలిచిపోయే నిర్ణయమని మంత్రి ఐ.టీ పరిశ్రమల శాఖ అధికారులవద్ద మరోసారి ఉద్ఘాటించారు. చరిత్రలో ఏ ప్రభుత్వం ప్రయత్నించని , ఆలోచించని వినూత్న విధానానికి నిదర్శనమన్నారు మంత్రి మేకపాటి. భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధి, ఈ- ప్రొక్యుర్ మెంట్, ఇన్సెంటివ్స్ వంటి అంశాలపై ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ లో చేపట్టవలసిన చర్యలపై మంత్రి ఆరా తీశారు.
