ఏపీలో జనసేన, బీజేపీల పొత్తుపై ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు, వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ చేగువేరా కాదు..బీజేపీలోకి చెంగుమని గంతేసి…చెంగు వీరుడు అయ్యాడంటూ సీపీఐ, సీపీఎం నేతలు విమర్శిస్తుంటే..వైసీపీ నేతలు పవన్ టీడీపీ కోసమే జనసేన పార్టీని నడిపిస్తున్నారని, బాబు కోసమే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారని మండిపడుతున్నారు. తాజాగా పవన్ పొత్తులపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. కేవలం టీడీపీ కోసమే జనసేన పార్టీని పవన్‌కల్యాణ్ నడిపిస్తున్నారని..అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. అసలు పవన్‌కు సిద్ధాంతాలు అనేవే లేవని విరుచుకుపడ్డారు. జనసేన-బీజేపీ పొత్తు కొత్తది కాదని.. 2014లోనే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయని గుర్తు చేసిన ఆయన ..పవన్ కొత్త పొత్తులపై వైఎస్సార్‌సీపీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. అయితే పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన బీజేపీతో పవన్ ఎలా పొత్తు పెట్టుకున్నాడని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కానీ, రాష్ట్ర ప్రయోజనాలు కానీ పవన్‌కు అవసరం లేదని.. ఆయన పొలిటికల్ ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నారని అమర్‌నాథ్ ఆరోపించారు.. అలాగే రాష్ట్రంలో ఏదో దోపిడీ జరిగిపోతున్నట్లు జనసేన, బీజేపీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.
తనకు కమ్యూనిస్టు భావజాలం ఉందన్న పవన్‌కల్యాణ్.. ఇప్పుడు కమ్యూనిస్టులకు బాకీ ఉన్నానా అని కసురుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. స్వయంగా పార్టీ అధ్యక్షుడై ఉండి..గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ 2024లో అధికారంలో వస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పవన్ 2024లో గెలవడం కాదని.. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా లేదా ఎంపీటీసీగా గెలిచి చూపించాలని, ఆ తర్వాత 2024 ఎన్నికలపై మాట్లాడాలని అమర్ నాథ్ సవాల్ చేశారు. పవన్ ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని.. ఇప్పుడు ఏపీలో మూడో ప్రత్యామ్మాయం అంటున్నారని..నిజంగా పవన్ కు మూడుకు ఏదో అవినాభావం సంబంధం ఉందని అమర్ నాథ్ సెటైర్లు వేశారు. సిద్ధాంతం లేని పవన్ అధికారం కోసమే బీజేపీతో కలిశారని ఆరోపించారు. బీజేపీ ఇస్తానన్న రాజ్యసభ సీటు కోసమే పవన్ ఆ పార్టీతో కలిశాడని ధ్వజమెత్తారు. పవన్ కెమెరా ముందుకంటే ప్రజల ముందు బాగా నటిస్తాడని విమర్శించారు. ఇక నిన్నటితో జనసేన పార్టీ అధ్యాయం ముగిసినట్టేనన్నారు. ‘సినిమాలైనా చేసుకోండి..రాజకీయాలనైనా చేసుకోండి కానీ సినిమా గ్యాప్‌లో మాత్రం రాజకీయాలు చేయొద్దని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు. మొత్తంగా సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచి చూపించు అంటూ పవన్ కల్యాణ్‌కు వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ విసిరిన సవాల్ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.