రాజధాని తరలింపుపై హైకోర్టులో మూడు రాజధానులు, సీఆర్‌డీఏ ఉపసంహరణ, రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిల్లులు ఏస్థాయిలో ఉన్నాయని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ సుబ్రమణ్యంను ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జేకే మహేశ్వరి ప్రశ్నించారు. శాసనసభలో బిల్లులు ఆమోదం పొంది మండలికి వెళ్లాయని ఏజీ తెలిపారు. మండలిలో సెలెక్ట్ కమిటీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు వివరించారు. బిల్లులపై విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడగా.. విచారణ జరగకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు తరలిస్తారని, విచారణ జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది అశోక్ భాన్ కోరారు. దీనిపై స్పందించిన సీజే.. విచారణ పూర్తయ్యేలోపు కార్యాలయాలు తరలిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అభిప్రాయపడ్డారు. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి హైకోర్టు వాయిదా వేసింది.
