ఐటీ రంగంలో హై ఎండ్ స్కిల్స్పై ఒక సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్నారు. మొదటగా విశాఖపట్నంలో తర్వాత దీనికి అనుబంధంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో తర్వాత కాలంలో రెండు సంస్థలను ఏర్పాటుచేసేదిశగా ప్రణాళిక రూపొందించాలన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలతో పోటీపడే పరిస్థితి రావాలంటే నైపుణ్యాలను ఆ నగరాలతో ధీటుగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు.
నైపుణ్యకేంద్రాలన్నీ ఒకే నమూనాలో ఉండాలని దీనికి సంబంధించిన ఆర్థిక వనరులను సమకూర్చుకుని సంవత్సరం వ్యవధిలో వాటి నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళిక పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి గొప్ప ఊతమిచ్చేలా ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను తీర్చిదిద్దాలని, 45 రోజుల్లోగా భూముల గుర్తింపు, ఆర్థిక వనరుల సమీకరణ పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. జగన్ నిర్ణయం సజావుగా అమలైతే రాష్ట్ర ఐటీ రంగం రూపురేఖలు మారిపోవడం ఖాయం.