ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి చేసిన ప్రకటనపై రాజకీయంగా దుమారం చెలరేగుతుంది. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబును కాపాడుకోవడం కోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి అధికార యంత్రాంగంతో కనీసం చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం నిర్ణయం తీసుకున్నారని సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై వైసీపీ నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ ఆర్‌కే రోజా ఘాటుగా స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు నిమ్మగడ్డను అడ్డం పెట్టుకొని కొత్త నాటకం ఆడారని, కుట్ర రాజకీయాలకు తెర తీశారని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఏ మాత్రం ఇష్టం లేదని, అందుకే- స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడం ద్వారా కేంద్రం నుంచి అందాల్సిన 5000 కోట్ల రూపాయల నిధులను అడ్డుకున్నారని మండిపడ్డారు.
సీఎం జగన్ కాని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను గానీ సంప్రదించకుండా కరోనా వైరస్ పేరుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేశారని ఆరోపించారు. తన విచక్షణాధికారాలతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినట్లు రమేష్ కుమార్ చెబుతున్నారని, అయితే చంద్రబాబు హయాంలో 2018లో జరగాల్సిన ఈ ఎన్నికలను అవే విచక్షణాధికారాలను ప్రయోగించి ఎందుకు నిర్వహించలేకపోయారని రోజా ప్రశ్నించారు. తాను ప్రజా వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తున్నాననే విషయం చంద్రబాబుకు తెలుసునని, అందుకే అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించే ధైర్యం చేయలేకపోయారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీని ఓఎల్ఎక్స్‌లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని రోజా డబ్బు, మద్యంరహితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తోంటే.. దాన్ని చంద్రబాబు అడ్డుకున్నారని, రమేష్ కుమార్ ద్వారా కుట్ర పూరితంగా వ్యవహరించారని విమర్శించారు. సీఎం జగన్ పాలనను ప్రజలు ఆమోదించడాన్ని చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలను ప్రజా కోర్టులో నిరూపిస్తామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడం వల్ల రాష్ట్రానికి కలిగే నష్టాన్ని ప్రజలకు వివరిస్తామని రోజా తెలిపారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వ్యవహారంలో ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చౌదరి తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది.