Home / ANDHRAPRADESH / పాలకొల్లులో జనసేన, టీడీపీ అనైతిక పొత్తు..షాకవుతున్న కమలనాథులు..!

పాలకొల్లులో జనసేన, టీడీపీ అనైతిక పొత్తు..షాకవుతున్న కమలనాథులు..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, ఆయన పార్టనర్ పవన్‌ కల్యాణ్‌ల మధ్య ఉన్న చీకటి బంధం మరోసారి బట్టబయలైంది. ఏపీలో బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నాడు. అయితే చంద్రబాబే పవన్ని తెలివిగా బీజేపీతో పొత్తు పెట్టుకునేలా చేసి రెండు పార్టీలను తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు పన్నాగం పన్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న జనసైనికుల పొత్తులు చూస్తుంటే..ఇది పక్కా చంద్రబాబు స్కెచ్ అని రుజువు అవుతుంది. ఏపీలో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ పొత్తులకు తిలోదకాలు ఇచ్చాడు. తాను సిన్మాల్లో షూటింగ్‌లు చేసుకుంటూ పార్టీని గాలికి వదిలేసాడు. క్షేత్ర స్థాయిలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తుల కంటే..జనసేన, టీడీపీల మధ్య పొత్తులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేనకు కాస్తా కూస్తో బలం ఉందని భావించే గోదావరి జిల్లాలో జనసేన పార్టీ నేతలు కాషాయపార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. బీజేపీ నేతలకు హ్యాండ్‌ ఇచ్చి టీడీపీ నేతలతో మీకిన్ని ఎంపీటీసీలు, మాకిన్ని జెడ్పీటీసీలు..మీకింత..మాకింత అంటూ రేటు మాట్లాడుకుని బేరం కుదుర్చుకుని పొత్తులు పెట్టుకుని మరీ ఎన్నికల్లో పోటీలు చేస్తున్నారు. కొందరు జనసేన నేతలు నిస్సిగ్గుగా టీడీపీ కండువా కప్పుకుని, నామినేషన్లు వేస్తుంటే కాషాయనాథులు అవాక్కవుతున్నారు.

 

తాజాగా పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ, జనసేనలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను పంచుకుని మరీ పోటీ చేస్తున్నారు. ఇందులో చిత్రమేమిటి అంటే..ఒక వైపు బీజేపీతో అధికారికంగా అధినేత పవన్ పొత్తు పెట్టుకుంటే..జనసైనికులు మాత్రం పొత్తు గిత్తు జాన్తానై తమకు ఎవరు డబ్బులు, పదవులు ఇస్తే వాళ్లతో పొత్తు, వాళ్లతో సీట్లు, పదవులు పంచుకుంటామంటూ టీడీపీతో కలుస్తున్నారు. అంతేకాదు ఏకంగా ఎన్నికల ప్రచారం కూడా ఉమ్మడిగా ప్రచారం చేస్తున్నారు. జనసేన అభ్యర్థులు కూడా ఉమ్మడిగా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. యలమంచిలి మండలం జెడ్పీటీసీగా టీడీపీ నుంచి కడలి గోపాలరావు పోటీ చేస్తుండగా, టీడీపీతో పొత్తులో భాగంగా బాడవ గ్రామ ఎంపీటీసీ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి ఇంటి సూర్యారావు అలియాస్ బాబురావు పోటీచేస్తున్నారు. కాగా వీళ్లిద్దరూ ఉమ్మడిగా ఒకే ఆటోలో ఫ్లెక్సీలు వేసుకుని గ్రామంలో ప్రచారం చేసుకోవడం చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఈ ప్రచారం చూసి స్థానిక బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా గోదావరి జిల్లాలంతటా జనసేన, టీడీపీల మధ్య అనైతిక పొత్తులు కుదురుతున్నాయి. అధ్యక్షుడు పవన్‌కు కావాల్సింది కూడా అదే…పేరుకు బీజేపీతో పొత్తు ఉన్నా..అంతిమంగా తన పార్టనర్ చంద్రబాబుకు లబ్ది జరగాలి..ఇదే పవన్ కోరుకునేది..జనసైనికులు కూడా అధ్యక్షుడి మనసెరిగి టీడీపీతో అనైతిక పొత్తులకు పాకులాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న ఈ పొత్తులను చూసి బీజేపీతో పెళ్లి..టీడీపీతో కాపురం..హవ్వ ఇదేమి పొత్తు పవనూ అంటూ ప్రజలు నోర్లు నొక్కుకుంటున్నారు.