Home / ANDHRAPRADESH / బాలయ్యకు షాక్…వైసీపీ నేతకు జేజేలు పలుకుతున్న హిందూపురం తెలుగు తమ్ముళ్లు.. ఎందుకో తెలుసా..!

బాలయ్యకు షాక్…వైసీపీ నేతకు జేజేలు పలుకుతున్న హిందూపురం తెలుగు తమ్ముళ్లు.. ఎందుకో తెలుసా..!

హిందూపురంలో వైసీపీ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. గతంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుని మానవత్వాన్ని చాటిన మహ్మద్ ఇక్బాల్…తాజాగా చేసిన ఓ మంచి పనికి ప్రత్యర్థులైన టీడీపీ నేతలు సైతం జేజేలు కొడుతున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న ఓ టీడీపీ కార్యకర్తకు మహ్మద్ ఇక్బాల్ ఆపన్నహస్తం అందించడం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన టీడీపీ కార్యకర్త తిమ్మారెడ్డి…ఎన్నో ఏళ్లుగా టీడీపీ జెండా మోస్తూ క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీకి సేవలందిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బాలయ్య గెలుపుకోసం ఆయన అహర్నిశలు శ్రమించారు. అయితే ఆయనకు పక్షవాతం రావడంతో గత 4 నెలలుగా మంచానికే పరిమితమయ్యారు.  ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేత, ఎమ్మెల్సీ ఇక్బాల్‌ స్వయంగా తిమ్మారెడ్డి ఇంటికెళ్లి ఆయన్ను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. చికిత్సల కోసం ప్రభుత్వ పరంగా సాయం అందించేందుకు కృషి చేస్తానని తిమ్మారెడ్డికి హామీ ఇచ్చారు.

 

పగవాడైనా ఇబ్బందుల్లో ఉంటే…ఆదుకునే సీమ ప్రజల మంచిమనసును ఇక్బాల్‌ మరోసారి చాటుకున్నారు. తమ పార్టీ కార్యకర్తకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఇక్బాల్‌ను చూసి టీడీపీ నేతలు ఆశ్చర్యపోయారు. కాగా రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే బాలకృష్ణ తిమ్మారెడ్డిని పరామర్శించి ఎలాంటి సాయం అందించకుండా వెళ్లారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బాలయ్య పట్టించుకోకున్నా..ప్రత్యర్థి పార్టీకి చెందిన ఇక్బాల్ వచ్చి ఆర్థిక సాయం అందించడమే కాకుండా తిమ్మారెడ్డి కుటుంబానికి అండగా నిలబడడంపై హిందూపురం తెలుగుతమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. మొత్తంగా టీడీపీ కార్యకర్తను ఆదుకున్న వైసీపీ నేత ఇక్బాల్‌ను మనసున్న నేత అని హిందూపురం తెలుగుతమ్ముళ్లు కొనియాడుతున్నారు.