ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే సుజనా, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి కీలక నేతలంతా బీజేపీలో చేరగా అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూపుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇవాళ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు ముఖ్య నాయకులు వైసీపీలో చేరారు. కాగా రెండు రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తోట త్రిమూర్తులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. నియోజకవర్గ, జిల్లా అభివృద్ధి కోసమే తాను వైఎస్సార్‌సీపీలో చేరానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమర్థవంతమైన నేత అయిన జగన్‌మోహన్ రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని చెప్పారు. ఏపీ అభివృద్ధి వైఎస్ జగన్‌తోనే సాధ్యమని, ఆ నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నానని త్రిమూర్తులు స్పష్టం చేశారు. పార్టీలోని సీనియర్లతో కలిసి జిల్లా అభివృద్ధికి సహకరిస్తానని ఆయన అన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం చంద్రబాబును నమ్ముకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భయపడుతున్న టీడీపీ నేతలు..ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా తోట త్రిమూర్తులు వంటి సీనియర్ నాయకులు, తన అనుచరులతో వైసీపీలో చేరడంతో జిల్లాలో టీడీపీ అడ్రస్ గల్లంతు కానుందని తెలుగు తమ్ముళ్లలో చర్చ జరుగుతోంది.
