Home / ANDHRAPRADESH / చంద్రబాబు. లోకేష్‌లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్..!

చంద్రబాబు. లోకేష్‌లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్..!

టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ లోకేష్‌ చేస్తున్న పాడుపనులపై ఫిర్యాదు చేస్తే కనీసం 80 శాతం మంది టీడీపీ నేతలు జైలుకు వెళతారంటూ..వైసీపీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందినట్లేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును, సీఆర్‌డీఏ బిల్లును చంద్రబాబుకు శాసనమండలిలో కుట్రపూరితంగా అడ్డుకుని సెలెక్ట్ కమిటీకి పంపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వివిధ పార్టీల నుంచి సభ్యుల పేర్లను మండలి కార్యాలయానికి పంపి సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చెయ్యాలని ఛైర్మన్ షరీఫ్ శాసనమండలి కార్యాలయానికి పంపించారు. అయితే రూల్‌ 154 కింద సెలెక్ట్ కమిటీ వేయడం చెల్లదని ఫైల్‌ మీద రాసి మండలి కార్యాలయ కార్యదర్శి తిప్పి పంపారు. దీంతో సెలెక్ట్ కమిటీ ఏర్పాటుపై వెనకడుగు పడింది. ఈ విషయంపై రోజా మాట్లాడుతూ… నిబంధనల ప్రకారం..మండలి చైర్మన్ ప్రకటన చేసిన 14 రోజుల్లోపు సెలెక్ట్ కమిటీలు ఏర్పాటుకావాలని, రాజధాని బిల్లుల విషయంలో అలా జరగలేదుకాబట్టి.. మండలిలో బిల్లులు ఆమోదం పొందినట్లుగానే భావించాలని చెప్పారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే సీఎం జగన్ మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలని చూస్తుంటే, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం ఆ నిర్ణయానికి అడ్డుతగులుతున్నారని రోజా ఫైర్ అయ్యారు. కేవలం తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు వికేంద్రీకరణపై సంకుచితంగా వ్యవహరిస్తున్నారని రోజా మండిపడ్డారు. సేవ్ అమరావతి ఉద్యమంలో భాగంగా చంద్రబాబు చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర సిగ్గుమాలిన చర్య అని ధ్వజమెత్తారు. మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తోన్న చంద్రబాబును ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తరిమికొడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

ఇక టీడీపీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో, బయటా పెద్ద ఎత్తున బూతు ప్రచారం జరుగుతున్నదని, ఇతర పార్టీల నేతలే టార్గెట్ గా అబద్ధాలు, అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. లోకేశ్ చేస్తున్న పాడుపనులపై ఫిర్యాదులు చేస్తే కనీసం 80 శాతం మంది టీడీపీ నేతలు జైళ్లలో పడతారని చెప్పారు. ఘోరమైన తప్పులు చేసినందుకే తండ్రీకొడుకుల్ని జనం ఛీత్కరించి మూలనపడేశారని, అయినా సరే బుద్ధి తెచ్చుకోకుండా దుష్ప్రచారాలు కొనసాగిస్తున్నారని రోజా ఓ రేంజ్‌లో బాబు, లోకేష్‌లపై ఫైర్ అయ్యారు. మొత్తంగా చంద్రబాబు, లోకేష్‌లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.